Hyderabad, December 31:  నగరంలోని షేక్‌పేటలో గల ఇండియన్ ఆయిల్‌కు సంబంధించిన ఓ పెట్రోల్ బంకులో (Indian Oil Petrol Pump) అగ్నిప్రమాదం (Fire Accident)  చోటుచేసుకుంది. కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కారులో ఉన్న ఇద్దరు కూడా వెంటనే బయటకు వచ్చేశారు. క్షణాల వ్యవధిలోనే కారు మొత్తం మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ ఫిల్లింగ్ మిషిన్లకు కూడా మంటలంటుకోవడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడి ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి.

ఈ ఘటనను చూసి జనాలు భయాందోళనలకు లోనయ్యారు. మంటలు ఎక్కడ చుట్టుపక్కల వ్యాపిస్తాయోనని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందిమంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది.

Watch the incident:

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.