తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ అక్టోబర్ 7, శనివారం భారతీయ జనతా పార్టీ బిజెపిలో అధికారికంగా చేరారు. భారతదేశం సహా విదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ కు బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకత్వం నుండి ఆమోదం లభించడంతో ఆయన నేడు బీజేపీలో చేరారు. అయితే గతంలో ప్రవీణ్ ప్రవేశాన్ని బిజెపి నాయకులలో ఒక వర్గం వ్యతిరేకించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని కలిసినప్పుడు చీకోటిని పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, చీకోటి ప్రవీణ్‌కు పార్టీలో చేరే తొలి ప్రయత్నంలోనే నిరాశే మిగిలింది.
వివాదాస్పద కాసినో నిర్వాహకుడైన చికోటి, సెప్టెంబర్ 12న బిజెపిలోకి చేరేందుకు సిటీలో ర్యాలీ తీసి మరీ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, ఆయనకు బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రవేశం లభించలేదు. అయితే తాజాగా చికోటి ప్రవీణ్ ను బీజేపీ జాతీయ నేత డీకే అరుణ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఆయనకు కండువా కప్పేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అందుబాటులో లేకపోవడం వార్తల్లో నిలిచింది.
చికోటి ప్రవీణ్ చరిత్ర
చికోటి సోషల్ మీడియాలో తన ఇంటర్వ్యూలలో పాములు, బల్లులు, ఇతర విదేశీ జంతువులను ప్రదర్శిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. గతంలో ఆయన ఒకసారి థాయ్‌లాండ్‌లో కాసినోపై పోలీసుల దాడిలో అనేక మందితో పాటు పట్టుబడ్డాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతను జూద కార్యకలాపాలు జరుగుతున్న హోటల్‌కు తెలియకుండానే అతిథిగా వెళ్లానని పేర్కొన్నాడు.
అంతేకాదు మతపరమైన ఉద్రిక్తతల మధ్య నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టినందుకు ప్రవీణ్‌పై జూలైలో గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వతహాగా క్యాజినో నిర్వహకుడు అయిన చికోటీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణతో పాటు పలు పోలీస్ స్టేషన్‌లలో పలు క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు.
అంతేకాదు హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసులు పండుగ బోనాల సీజన్‌లో అక్రమ ఆయుధాలతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నందుకు అతనిపై కేసు నమోదు చేశారు. కేసు ఉన్నప్పటికీ, అతను కోర్టు నుండి బెయిల్ పొందగలిగాడు.
ఇవన్నీ చికోటిని బీజేపీలోకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. వచ్చే ఎన్నిక ల్లో ఎల్బీ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్టు దక్కించుకోవాలని చీకోటి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.