
Hyd, March 18: సమ్మక్క-సారలమ్మల జాతరపై చిన్న జీయర్ (Chinna Jeeyar) చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవడంతో ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం చిన్న జీయర్ స్వామి ఆ వీడియోపై స్పందించి మీడియా సమావేశం నిర్వహించారు.
20 ఏళ్ల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వారి సొంత లాభాల కోసం వివాదం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలపై పూర్వాపరాలు తెలుసుకోకుండా కొందరు పనిగట్లుకొని సమస్యగా మారుస్తున్నారన్నారు. గ్రామ దేవతల్ని అవమానించారనడం సరికాదన్నారు.
కులం, మతం తేడా అనే తేడా లేదని అందరినీ గౌరవించాలనేదే మా విధానం అని ఆయన తేల్చి చెప్పారు. ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాలు తలెత్తాయని, మాపై వచ్చిన ఆరోపణలు, ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు.
రాజకీయాలకు తాము దూరమని, రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరితోనూ గ్యాప్ లేదని, ఎవరైనా దూరం ఉంటే మాకు సంబంధం లేదన్నారు. తాము ఎవరితో పూసుకొని తిరగమని, ఎవరైనా అడిగితే సలహా ఇస్తాం.. పిలిస్తే వెళతామన్నారు. యాదాద్రికి కూడా పిలిస్తే వెళ్తామని, లేదంటే చూసి ఆనందిస్తామని చెప్పుకొచ్చారు