111 జీవోను ఎత్తేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు తొలగించి జీవోను ఎత్తేస్తామని.. అందుకోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. అదేవిధంగా మూసీ, ఈసా నదీ జలాలను కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీలో నిరసన తెలిపిన సీఎం కేసీఆర్.. మంగళవారం హైదరాబాద్‌లో కేబినెట్ భేటీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉంటే జీవో 111 హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్ మండలాలు పూర్తిగా.. వికారాబాద్ జిల్లాలోని శంకర్పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, షాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ పట్టణానికి తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి.
రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా త్రిబుల్ వన్ జీవో నేపథ్యంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేయాలంటూ చాలామంది కోర్టును ఆశ్రయించారు.
పర్యావరణ వేత్తల ఆందోళన...
జీవో 111 ఎత్తివేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ వేత్తలు, నీటి వనరుల రంగ నిపుణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపాన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు ఉన్నాయని, నగరంతో ముడిపడిన జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం మొత్తం కూడా ఈ జలాశయాల పరిధిలోనే ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతి సహజసిద్ధమైన లక్షణం, నగరానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు దెబ్బతింటే.. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.