CM KCR Speech (Photo-Twitter)

నారాయణఖేడ్‌‌, ఫిబ్రవరి 21: బంగారు తెలంగాణని తయారు చేసుకున్నట్టే.. బంగారు భారతదేశాన్ని తయారుచేద్దామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నారాయణఖేడ్‌‌లో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దుర్మార్గమైన మత రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఢిల్లీ దాకా కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. తాను పోరాటానికి బయల్దేరానని, మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలని కేసీఆర్‌ కోరారు

నారాయ‌ణ్‌ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌ను ఎట్ల బాగు చేసుకున్నామో.. అదే ప‌ద్ధ‌తిలో భార‌త‌దేశ రాజ‌కీయాల్లో కూడా ప్ర‌ముఖ పాత్ర పోషిస్తానని చెప్పారు. త‌ప్పుకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా త‌యారు చేయాలన్నారు.

“మ‌నం అమెరికా పోవ‌డం కాదు.. ఇత‌ర దేశాలే వీసాలు తీసుకొని మ‌న దేశానికి వ‌చ్చే ప‌రిస్థితి చేసేంత గొప్ప సంప‌ద‌, వ‌నరులు, యువ‌శ‌క్తి ఈ దేశంలో ఉన్న‌ది. కాబ‌ట్టి నేను పోరాటానికి బ‌య‌లుదేరా. బంగారు తెలంగాణ‌ను ఎలా త‌యారు చేసుకున్నామో.. బంగారు భార‌త‌దేశాన్ని కూడా త‌యారు చేసుకుందాం..”అని స్ప‌ష్టం చేశారు.