Hyderabad, March 02: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ఉచిత బస్సు, రూ.500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా మరో పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఇళ్ల పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని (Indiramma House Scheme) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఇల్లు లేని నిరుపేదలకు ఈ స్కీమ్ ను వర్తింపజేయలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.