Hyderabad, June 28: రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పంట రుణాల మాఫీకి (Farm Loan Waiver) రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. రేషన్ కార్డు (Ration Card) కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే అని వెల్లడించారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. ”రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చే సరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనుల జరగడం వల్ల అంతరాయం ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పా. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడని అధికారులకు ఆదేశాలిచ్చా. బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదు.
మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది. 30 శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. దీని వలన ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.