Hyderabad January 29: తెలంగాణలో చలి పంజా (Cold Wave) విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవగా.. చలికి జనం వణుకుతున్నారు. మరో రెండు రోజుల పాటూ ఇదే తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం (Khammam)లో11, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా.. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 4.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది.
దీనికి తోడు దట్టంగా పొగమంచు (Fog) కురుస్తున్నది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో ఎదుట ఏం ఉన్నదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మంచుదుప్పటి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లైట్లు వేసుకొని వాహనాలు నడుపాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతోనే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గత 20 సంవత్సరాల్లో ఇంత చలి తీవ్ర ఎప్పుడూ లేదని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ తర్వాత చలి క్రమంగా తగ్గుతుంది. కానీ, ఈ ఏడాది జనవరి చివరికి వస్తున్నా తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే మరో మూడు రోజులు రాష్ట్రంలో చలితీవ్రత ఉంటుందని తెలిపింది.
ఉత్తరాధి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు చల్లగానే ఉంటుంది. సాయంత్రం 3 గంటల తర్వాత చలి ప్రారంభం అవుతున్నది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతుండడంతో చలి పెరుగిందని, ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యంత ఎక్కువగా నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 33.9 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.