Medaram Sammakka Saralamma Jatara (Photo-Twitter)

Medaram, FEB 21: నేటి నుంచి మేడారం మహా జాతర (Medaram Jathtara) ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు. సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న (Jampanna) మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధిచేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు.

 

కన్నెపల్లిలోని సారలమ్మ (Kannepalli) గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.