Hyderabad, Sep 2: జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో అత్యంత సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) (DJHS General Body Meeting) కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో తమకు కూడా ఇంటి స్థలాలపై సీఎం ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన డీజేహెచ్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరామన్నారు. తమ విన్నపం మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారని తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా రేవంత్‌రెడ్డిని కలిశామన్నారు. అలాగే సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించామన్నారు.
నిర్ణీత సమయంలో ఇంటి స్థలం ఇచ్చేలా..
సీఎం తమతోనూ, పలు సందర్భాల్లోనూ జర్నలిస్టులకు ఇళ్ల విషయంలో సానుకూలంగా ఉన్నారన్నారు. తమకు కూడా రేవంత్‌రెడ్డి ఇంటి స్థలం ఇస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందని బొల్లోజు రవి ధీమా వ్యక్తంచేశారు. వచ్చే వారం జవహర్ లాల్ సొసైటీకి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో తమకూ ఇచ్చేలా ప్రకటన చేయాలని సీఎంను కోరారు. అలాగే ప్రకటనతోపాటు నిర్ణీత సమయంలో ఇంటి స్థలం ఇచ్చేలా ప్రకటన చేయాలని జనరల్ బాడీ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది.
సమావేశంలో వీళ్లు
డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు ప్రతాప్‌రెడ్డి, డి.రామకృష్ణ, నాగరాజు, సలహాదారు విక్రమ్, సభ్యులు బి,సురేష్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.