Hyderabad, JAN 11: పెంపుడు జంతువులైన కుక్కలను దొంగిలించడం చూశాం.. కానీ పిల్లులను (Cat theft) కూడా దొంగతనం చేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని (rare breed) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ కోల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్‌అజహార్ మహమూద్ (Sheikh Hussain Mahabub) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేసి, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ (Nomani) అని నామకరణం చేశారు.
అయితే ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్‌లో, మరొకటి బ్లూ కలర్‌లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి ఆ పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో బాధితుడు సోమవారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.