Hyderabad, JAN 10: సంక్రాంతికి సొంతూరికి (Sankranti) వెళ్లేముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారా? ఎప్పటిలాగే డోర్‌మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్స్‌లో తాళాలు వదిలి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటున్నది తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police). సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండుగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు (Telangana Police Alert). సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఆ సూచనలు పాటిస్తూ.. ‘పండగకు మీరు సంతోషంగా ఇండ్లకు వెళ్లండి.. అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తాం’ అంటూ భరోసా ఇస్తున్నారు. మెయిన్ డోర్‌కు (Door Lock) తాళం వేస్తే.. అది కనిపించడకుండా కర్టెన్స్‌తో కవర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు ఇంటి లోపల, బయట లైట్లు వేస్తే మంచిదని అంటున్నారు.
ఇంటి దగ్గర నమ్మకమైన ఇరుగుపొరుగువాళ్లకు ఇంటిని గమనించాలని చెప్పండి. ఇంటికి వచ్చే, వెళ్లే దారుల్లో, ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. అల్మరా, కప్ బోర్డ్స్‌కు సంబంధించిన తాళాలు చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల కింద, అల్మరాపైన, డ్రెస్సింగ్ టేబుల్‌లో, కప్‌బోర్డ్స్‌లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచటం ఉత్తమమని చెప్తున్నారు. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్లకు, గుడికి వెళ్లేప్పుడు తగు జాగ్రతలు తీసుకోవాలని, బయటికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.
Sankranthi Holidays in AP: ఏపీలో జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 19న పాఠశాలలు పునఃప్రారంభం
పోలీసుశాఖ సూచనలు
ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోండి.
మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం అమర్చుకోవడం మరీ మంచిది.
తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి.
మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. తప్పనిసరిగా డయల్ 100కు కాల్ చేయండి.
మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పారు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్‌తో లాక్ వెయ్యడం మంచిది.
నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్‌మెన్/ సెక్యూరిటీ గార్డ్/సర్వెంట్‌గా నియమించుకోవాలి.
మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ ఉండాలి.
ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది.