Telangana RTC Strike -High Court: ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 18కి వాయిదా,  రోజులు గడుస్తున్నా ఏమి తేల్చలేకపోతున్న ఉన్నత న్యాయస్థానం, ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం
High Court of Telangana| TSRTC Strike | Photo Credits: Wikimedia Commons

Hyderabad, November 13: ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) అంశంపై హైకోర్ట్ (High Court of Telangana) లో విచారణ మరోసారి వాయిదా పడింది.  "ఆర్టీసీ సమ్మె చట్ట బద్ధత" మరియు "రూట్ల ప్రైవేటీకరణ" అంశాలపై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సమ్మె చట్టబద్ధతపై తేల్చేందుకు హైకోర్ట్ ప్రతిపాదించిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ అంశం కార్మిక న్యాయస్థానం పరిధిలో ఉన్నందున చట్ట ప్రకారం లేబర్ కమీషన్‌కు ఆదేశాలివ్వాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

మరోవైపు కమిటీ ఏర్పాటుకు హైకోర్టుకు అధికారం ఉంటుందని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దానికి ఏజీ స్పందిస్తూ ఎస్మా చట్టం ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం అవుతుందని వాదించారు.  1998లో ఎస్మా చట్టం కింద ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి జారీ చేయబడిన జీవో టీఎస్ ఆర్టీసీకి వర్తించదని హైకోర్ట్ పేర్కొనగా,  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశాం, కాబట్టి ఆ జీవో వర్తిస్తుందని ఏజీ వాదించారు. సెక్షన్ 47 ప్రకారం టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తీసుకోలేదు కదా అని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇలా వాదోపవాదాల మధ్య హైకోర్ట్ ఈ అంశంపై విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

ఇక ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశాన్ని గురువారం చర్చిస్తామని, దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎప్పట్లాగే ప్రైవేటీకరణపై రేపటి వరకు స్టే కొనసాగుతుందని హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, గత 40 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా సమ్మెపై హైకోర్ట్ ఎటూ తేల్చలేకపోతుంది. అక్టోబర్ 6న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 9-10 నుంచి విచారణ ప్రారంభమైంది. అప్పట్నించీ పలు దఫాలుగా హైకోర్టులో విచారణ జరగడం, వాయిదా పడుతూ రావడం జరుగుతుంది. దీనివల్ల సమ్మె కాలం పొడగించబడుతూ వస్తుందే తప్ప. సమ్మె ఎప్పుడు ముగుస్తుంది? దీనికి పరిష్కారం ఏంటనేది ఇప్పటికీ తెలియరాలేదు. ఈ ప్రతిష్ఠంభన కారణంగా ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది, ఇప్పటివరకు సుమారు 20 మంది వరకు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇటు రూట్ల ప్రైవేటీకరణ అంశం కూడా ప్రతీరోజు వాయిదా పడుతుంది. దీనివల్ల సరిపడే బస్సులు లేక రోజూ ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు, బస్సుల్లో ప్రయాణించే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వ పెద్దలు, ఆర్టీసీ జేఏసీ నేతలు, రాజకీయ నేతలు అందరూ బాగానే ఉంటున్నారు. ఎటొచ్చి నలిగిపోయేది కార్మికులు, సామాన్య ప్రజలేననే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. హైకోర్టులో విచారణ మళ్లీ మళ్లీ వాయిదా పడకుండా వెంటనే ఎటో-అటు తేల్చేస్తేనే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు.