TSRTC Strike at Day 40: హైకోర్ట్ ప్రతిపాదనపై విముఖత వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీపై అత్యున్నత స్థాయి కమిటీ అవసరం లేదని అఫిడఫిట్ దాఖలు, ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ
High Court of Telangana | TSRTC Strike | File Photo

Hyderabad, November 13:  టీఎస్ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్ట్ (High Court of Telangana) ప్రతిపాదించిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఉన్నతస్థాయి కమిటీ పట్ల తెలంగాణ ప్రభుత్వం విముఖత చూపింది. ఆర్టీసీ సమ్మె అంశం లేబర్ కోర్టులో ఉన్నందున కమిటీ అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.  పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీల జోక్యం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ప్రభుత్వం,  హైకోర్ట్ దృష్టికి తీసుకువచ్చింది.  ఆర్టీసీ సమ్మెపై లేబర్ కమిషన్‌ చట్టం ప్రకారం ఆదేశాలు ఇవ్వాలని  తన అఫిడవిట్‌లో పేర్కొంది.

1947 పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం (Industrial Disputes Act, 1947) ప్రకారం కార్మికులందరూ కంపెనీ చట్టాలను పాటించాలని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఈ ఆదేశాలను పాటించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఇక నేటితో ఆర్టీసీ సమ్మె 40వ రోజుకు చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు, నిరసనలు కొనసాగుతున్నాయి. మహాబూబాబాద్ పట్టణంలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేసే ఆవుల నరేష్ (51) బుధవారం ఉదయం పురుగుల మందు సేవించాడు. దీంతో అతణ్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు అంతిమసంస్కారాలు నిర్వహించబోమని తేల్చి చెప్పారు.

ఆర్టీసీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్ట్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేవని, ఇక ఆఖరి ప్రయత్నంగా సమస్య పరిష్కారం కొరకు మరియు సమ్మె చట్ట విరుద్ధమా, కాదా? అని తేల్చేందుకు ముగ్గురు సుప్రీం విశ్రాంత జడ్జీలతో ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని హైకోర్ట్ మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వేస్తే సమ్మెపై పునరాలోచన చేస్తామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

కమిటీపై ప్రభుత్వం అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో నిన్న మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం, ఈ కమిటీ ప్రతిపాదనపై తన నిరాసక్తతను వ్యక్తం చేస్తూ ఈరోజు అఫిడఫిట్ దాఖలు చేసింది. హైకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతుంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంలో వాదనలు జరుగుతున్నాయి. ఈ ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం నుంచి వరుసగా హైకోర్ట్ స్టే విధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.