(Image Credit : Twitter)

Hyd, Oct 30: తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించేందుకు సిద్ధపడగా. సాయంత్రం 5 గంటల సమయం నాటికి 76 శాతం పోలింగ్ నమోదయ్యింది. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్య ర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఇరు పక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి.

ఉదయం జమ్మికుంట, కోరుగర్లులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికేతరులు పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈనేపథ్యంలో ఇరు వర్గాలవారు బాహాబాహీకి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

అలాగే వీణవంక మండలం గన్ ముక్కుల పోలింగ్ బూత్ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకుడు కౌశిక్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్‌ రెడ్డిని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఓటువేశారు.

నంబర్ ప్లేట్, ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో ఈటల వెంట తిరుగుతున్న వాహనాన్ని, అందులో ప్రయాణిస్తున్న ఈటల పీఆర్వో చైతన్యను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పీఏలతో స్థానికులు ఘర్షణ పడ్డారు. అనంతరం పోలీసలుకు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.