
Hyderabad January 20: హైదరాబాద్‌లో ఓ చైన్ స్నాచర్ (Chain snatcher) రెచ్చిపోయాడు, కేవలం ఆరు గంటల్లో ఆరు చైన్ స్నాచింగ్ లు చేశాడు. నగరమంతా చుట్టి వచ్చిన చోరుడు, కుత్బుల్లాపూర్ (Kuthbullapur) సర్కిల్ నుంచి మొదలు పెట్టి మేడిపల్లి(Medipallly) వరకు చేతివాటం ప్రదర్శించాడు. యధేచ్చగా చైన్ స్నాచింగ్ చేస్తున్నప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల...దర్జాగా యాక్టీవా బండిపై తిరుగుతూ పని కానిచ్చాడు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్(Pet basheerabad) పరిధిలో బుధవారం ఉదయం 11:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి మొదటగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. తర్వాత మారేడ్‌పల్లి(maredpally), తుకారాంగేట్(Tukaram gate), మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చోరీల పర్వం కొనసాగించాడు. అయితే అంతటా చేతి వాటం ప్రదర్శించింది ఒక్కడేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిందితుడు ముఖానికి మాస్కు, జాకెట్ ధరించి, క్యాప్‌తో యాక్టీవా వాహనంపై సంచరించాడని తేలింది. ఈ వాహనం కూడా ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలోని ఓ ఇంటి దగ్గర నుంచి దొంగిలించాడని స్పష్టమైంది. ఈ వరుస చైన్ స్నాచింగ్‌లతో అప్రమత్తమైన పోలీసు అధికారులు హుటాహుటిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
స్నాచర్‌ను పట్టుకోవడంలో ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన దుండగుడి ఫొటోను సీసీ కెమెరాల ద్వారా నిమిషాల్లో సేకరించినప్పటికీ.. అతడి ఫొటోను మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరికీ షేర్ చేయకుండా.. ఎవరికి వారే తామే పట్టుకోవాలనే ఆశతో సమన్వయాన్ని మరిచారని విమర్శలు వినవస్తున్నాయి. ఒకసారి ఫొటో దొరకగానే ఫీల్డ్‌లో ఉండే పెట్రోలింగ్, ఇతర సిబ్బందికి వాట్సాప్‌తో పాటు ఇతర సాంకేతిక పరంగా షేర్ చేసుకుని ఉంటే స్నాచర్ ప్రయాణించిన 20 కిలో మీటర్ల దూరంలో దొరికిపోయేవాడు. కాని అలా జరగకపోవడంతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సాఫీగా తిరుగుతూ పంజా విసిరాడు.
స్నాచర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే దుండగుడు బయటి రాష్ట్రం నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు నగరానికి చెందిన పాత స్నాచర్ అయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన వాహనం టీఎస్ 13ఈయూ 2844 లేదా 2044గా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడి చైన్ స్నాచింగ్ లు ఉదయం 11 గంటలకు మొదలైంది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని భాగ్యలక్ష్మికాలనీలో ఉ.11.30 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్న ఉమారాణి వెనకాల నుంచి వచ్చి గొలుసు తెంపబోయాడు. ఆమె అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన టి.అనురాధ మధ్యాహ్నం 12.15 గంటలకు కూరగాయలు కొనడానికి వెళ్తుండగా వెనకాల నుంచి వచ్చి రెండు తులాల గొలుసును తెంపుకొని పారిపోయాడు. ఇక పేట్ బషీరాబాద్ పీఎస్ జీడిమెట్ల గ్రామంలో వరలక్ష్మి బయటి నుంచి ఇంటికి నడచుకుంటూ వెళ్తుండగా వెనకాల నుంచి వచ్చిన వ్యక్తి నాలుగు తులాల బంగారు గొలుసును తెంపుకొని పోయాడు.
మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరా రైల్వే కాలనీకి చెందిన విజయ తన కూతురుకు జ్వరం వచ్చిందని దవాఖానకు వెళ్తుండగా స్నాచర్ వెనకాల నుంచి వచ్చి ఐదు తులాల బంగారు గొలుసును తెంచుకుపోయాడు. అడ్డగుట్ట రియో పాయింట్ వద్ద రాంబాయి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకాల నుంచి వచ్చి రెండున్నర తులాల బంగారు ఆభరణాన్ని తెంచుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం 5 గంటలకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ బోడుప్పల్ హనుమాన్‌నగర్ వద్ద వాకింగ్ చేస్తున్న అంజమ్మ మెడలోనుంచి ఐదు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయాడు.