Hyderabad December 18: హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో (Gachibowli) ఘోర కారు ప్రమాదం(Car Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన(Over Speed) కారు హెచ్‌సీయూ(HCU) వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళా జూనియర్ ఆర్టిస్టులు(junior artist) అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
మృతులను కారు డ్రైవర్ అబ్దుల్ రహీమ్ (విజయవాడ), ఎం మానస (మహబూబ్‌నగర్), ఎన్ మానస (కర్ణాటక)గా గుర్తించారు. అబ్దుల్ రహీం బ్యాంక్ ఉద్యోగికాగా, మహిళలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు. గాయపడిన వ్యక్తి సిద్ధు అలియాస్ సాయి సైదులు అని, అతడు కూడా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరు అమీర్‌పేటలోని హాస్టల్ ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన కారు(TS 07 UH 1349)పై 15 ఈ-చలాన్లు ఉన్నాయి. 15లో 12 ఓవర్ స్పీడ్‌కు(Over speed) సంబంధించిన చలాన్లే. మిగతా రెండింటిలో ఒకటేమో రాంగ్ పార్కింగ్, మరొకటేమో సిగ్నల్ జంప్(Signal Jump)కు సంబంధించిన చలాన్లు. స్పీడ్ లిమిట్ 100 ఉన్న రహదారులపై ఈ కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడ్‌తో దూసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన సైబరాబాద్ పరిధిలో స్పీడ్ లిమిట్ 40 ఉన్న రోడ్డులో 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ కారుపై రూ. 14,625 జరిమానా ఉంది. ఈ వాహనంపై సైబరాబాద్, హైదరబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే అధికంగా ఓవర్ స్పీడ్ చలాన్లు నమోదు అయ్యాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సాయి సిద్ధూ పలు విషయాలను వెల్లడించాడు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ‘మేం రాత్రి సిట్టింగ్ వేశాం.. ముగ్గురు మందు తాగారు. నేనేం తాగలేదు. మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అని అన్నారు. ఎందుకు ఈ టైమ్‌లో బయటకు వెళ్లడం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు రమ్మని అడిగితేనే బయటకు వచ్చాను. నాకు డ్రైవింగ్ రాదు.. అబ్దుల్ అనే కుర్రాడు బ్లాక్ డాగ్ తాగాడు. అమ్మాయిలు బీర్లు తాగారు. కారు అబ్దులే నడిపాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్‌గా వస్తుంటే యాక్సిడెంట్ అయింది. నేను అప్పట్నుంచి కోమాలోనే ఉన్నాను. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తే జీరో వచ్చింది. అమ్మాయిలు చెప్తే వినకుండా బయటకు తీసుకొచ్చారు’ అని సాయి సిద్దూ పేర్కొన్నారు.