Hyderabad, AUG 25: అమాయకులను దోచేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించి పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు. గుజరాత్ (Gujrat) రాష్ట్రంలో 7 బృందాలతో గాలించి.. 20 కేసుల్లో 36 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నామని, వీరికి దేశ వ్యాప్తంగా 983 కేసులతో సంబంధాలున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ (CCS) కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్‌కు చెందిన 74 ఏండ్ల వృద్ధురాలికి తాము ముంబై అందేరీ పీఎస్ పోలీసులం మాట్లాడుతున్నామని, ఫెడెక్స్ కొరియర్‌లో ‘మీ పేరుతో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.. మీపై మనీలాండరింగ్ కేసు నమోదైంది’ అంటూ.. కాల్ చేసి బెదిరించి రూ.1.6 కోట్లు దోచేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ప్రధాన నిందితుడు కోల్‌కతాకు చెందిన దీపక్ రావత్ దుబాయ్‌లో ఉంటూ గుజరాత్‌కు చెందిన సాగర్ గోర్ధానభాయ్ ప్రజాపతి, పరంకర్ కిరీట్ నాథూభాయ్ సహకారంతో బ్యాంకు ఖాతాలను సమకూర్చుకొని.. ఈ మోసం చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిపై ఎల్‌వోసీ (LOC) జారీ చేయగా, మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 10.08 లక్షల నగదు, వివిధ బ్యాంకు చెక్ పుస్తకాలు, 22 బ్యాంకు ఖాతాల డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ట్రేడింగ్ పేరుతో రాంకోఠికి చెందిన ఓ వ్యాపారిని వాట్సాప్‌లో సంప్రదించిన సైబర్‌నేరగాళ్లు..‘మేం చెప్పినట్లు ట్రేడింగ్ చేస్తే.. 500 శాతం లాభాలొస్తాయి’..అంటూ నమ్మించి దఫ దఫాలుగా బాధితుడి నుంచి రూ. 2 కోట్లు వసూలు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా బ్యాంకు ఖాతాలు గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన బృందం స్పిన్నింగ్ మిల్ వ్యాపారం చేసే చుదాసమ కుల్‌దీప్‌సిన్హా అనోప్ సిన్హా, ప్రైవేటు ఉద్యోగి జడేజా దైవత్‌సిన్హా కృతిసిన్హా, కారు డ్రైవర్ సినోజియ కేతాన్ సురేశ్‌భాయ్‌లను పట్టుకున్నారు. ఈ ముగ్గురు బ్యాంకు ఖాతాలు అపరేట్ చేస్తూ విదేశాల్లో ఉండే ప్రధాన నిందితులకు సహకరిస్తుంటారు. బాధితులు ఆయా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసిన నగదును హవాలా మార్గంలో నిందితులకు పంపిస్తున్నారు.
బేగంపేటకు చెందిన రిటైర్డు ఉద్యోగికి వాట్సాప్‌లో సంప్రదించిన సైబర్ నేరగాళ్లు.. మోత్లై.కామ్ పేరుతో ఉన్న ఒక అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయించి.. దాని ద్వారా ట్రేడింగ్ చేయిస్తూ రూ. 60.88 లక్షలు దోచేయగా, పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా గుజరాత్‌కు వెళ్లి దర్యాప్తు జరిపారు. కనాని నికుంజ కిశోర్ భాయ్ వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, ప్రవీణ్ భాయ్ కలుభాయ్ వసోయ అనే మరో వ్యక్తితో కలిసి ఈ నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. మొదట్లో కొన్ని లాభాలు చూపించి, ఆ తరువాత భారీగా పెట్టుబడులు పెట్టిస్తూ ఈ ఇద్దరు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు తేలింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రూ. 27.20 లక్షల నగదు, 226 చెక్ బుక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ నిందితులకు 142 కేసులతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది.