Hyderabad, April 03: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో (Radison blue) నిర్వహిస్తున్న భారీ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో (Fooding and mink pub) రేవ్ పార్టీ (Rev party) నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సమయానికి మించి నడపడంతో పాటు రేవ్ పార్టీని నిర్వహిస్తుండటంతో పబ్ యజమానులు సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో కొకైన్ (Cocaine), గంజాయి (Ganja), కొన్ని రకాల డ్రగ్స్ (Drugs), ఎల్‌ఎస్‌డీతో (LSD) ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ (Pub) యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పబ్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తెకు చెందినదిగా గుర్తించారు.
అదుపులోకి తీసుకున్న యువకులు పోలీసు స్టేషన్ లో తమను ఎందుకు తీసుకు వచ్చారంటూ ఆందోళన చేశారు. రాహుల్ సిప్లిగంజ్ కు నోటీసులు ఇచ్చి పోలీసులు పంపిచేశారు. పబ్ లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.
రాడిసన్ బ్లూ హోటల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు, సిగరెట్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇది రేవ్ పార్టీ కాదని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. పబ్బు నిర్వాహకులు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత కూడా పబ్బు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపారని పేర్కొన్నారు.