Hyderabad, March 5: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పై బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్‌లో స్థానిక పబ్‌లో దాడి (Assault) జరిగింది. కొంతమంది రాహుల్‌పై దాడి చేయడంతో పాటు, ఒక వ్యక్తి అతడి తలపై బీరు బాటిల్‌ను పగలగొట్టినట్లు వీడియో ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది. దీంతో రాహుల్ అక్కడే కింద పడిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో రాహుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి రాహుల్ డిశ్చార్జి అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
నివేదికల ప్రకారం, రాహుల్ పై దాడికి గల కారణాలు ఇలా ఉన్నాయి. రాహుల్ సిప్లింగంజ్ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలి సమీపంలో గల ప్రిస్మ్ పబ్‌కు వెళ్లారు. అయితే రాత్రి 11:45 సమయంలో కొంతమంది గ్యాంగ్ రాహుల్ స్నేహితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించారని అభియోగం. దీనిపై వారిని నిలదీయగా ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ముదరడంతో ఆ గ్యాంగ్ వచ్చి రాహుల్ పై దాడి చేశారు. దాడి చేసిన వారు తాండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంబంధీకులని తెలిసింది. రాహుల్ సిప్లిగంజ్ మాస్ హిట్ సాంగ్స్
అయితే, రాహుల్ మాత్రం ముందుగా ఎవరిపై కేసు పెట్టలేదని సమాచారం, అయితే అతడిపై జరిగిన దాడికి సంబంధించి వీడియో వైరల్ అయింది మీడియా ద్వారా పోలీసుల వరకు చేరింది. ఆ వీడియోను సాక్ష్యంగా రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆ వీడియో ఆధారంగా అందులోని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. తనపై దాడి చేసిన వారికి రాజకీయంగా పలుకుబడి ఉన్నప్పటికీ, తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానని రాహుల్ ఒక మీడియా ఛానెల్ తో వెల్లడించారు.