Rains Lash Telangana (Photo-Video Grab)

Hyd, April 24: దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో కొద్దిరోజులుగా వానలు దంచికొడుతున్నాయి.

ఇక రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సోమవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని సూచించింది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 21.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో ఆదివారం కూడా భారీ వర్షం కురిసింది. వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో అరగంట నుంచి గంటపాటు వడగళ్లు పడటం, ఈదురుగాలులు తోవడంతో పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచి పదుల సంఖ్యలో గ్రామాల్లో అంధకారం నెలకొంది. వరి, మొక్కజొన్న, మిర్చి, నువ్వులు, మినుములు తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పునాదులు వేసినందుకు అమిత్‌ షాకు ధన్యవాదాలు! కేంద్రహోంమంత్రి టూర్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 29 మండలాల్లో, ఖమ్మం గ్రామీణం సహా 9 మండలాల్లో సుమారు పది నుంచి 20 వేల ఎకరాల్లో వరి సహా పలు పంట లు దెబ్బతిన్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కోదాడ, తుంగతుర్తి సహా తొమ్మిది మండలాల్లో 18,502 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కరీంనగర్‌ జిల్లాలోని వివిధ మండలాల్లో అయిదు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.

జగిత్యాల జిల్లాలో మామిడి, నిమ్మ, మిరప తోటలు భారీగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీప పూర్యానాయక్‌ తండాకు చెందిన కేలోతు రంగమ్మ(45) ఆదివారం సాయంత్రం ఇంటి ఆవరణలో నిలబడి ఉండగా సమీపంలో పిడుగుపడింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుమురంభీం జిల్లా లింగాపూర్‌ మండలంలో పిడుగుపడి ఎద్దు మృతిచెందింది.

ముందు నీ సీఎం సీటు కాపాడుకో కేసీఆర్! అధికారంలోకి వచ్చాక దొంగలను జైళ్లో వేస్తామంటూ అమిత్ షా వార్నింగ్, చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వాన

హనుమకొండ జిల్లాలో 20,100 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి రవీందర్‌ సింగ్‌ తెలిపారు. 20కిపైగా ఇళ్లు దెబ్బతినగా.. 15కుపైగా గుడిసెలు నేలమట్టమయ్యాయి. గూడూరులో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. జనగామ జిల్లాలోని మండలాల్లో 21,559 ఎకరాల్లో వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పెద్దపల్లి జిల్లాలో 14,620 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కరీంనగర్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం 23,709 ఎకరాల్లో పంటనష్టం జరిగింది.

అకాల వర్షాలతో పంట నష్టంపై అంచనాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలు, ఇతర నష్టాలపై సీఎం ఆదివారం సమీక్షించారు. జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు.