Hyderabad, July 29: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై(Kishan Reddy) బీజేపీ బహిష్కృత నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని జిట్టా ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అని జిట్టా మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ(BJP) ప్లాన్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ తో(BRS) లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. అంతేకాదు కిషన్ రెడ్డిని సమైక్యవాదిగా అభివర్ణించారాయన. ”భద్రాచలం రాముడి గుడిని అభివృద్ధి చేయలేని సిగ్గు శరం లేని మంత్రి కిషన్ రెడ్డి. కుట్రలో భాగంగానే బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్ ను(Bandi Sanjay) అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించారు. మీడియాకు లీకులిచ్చి స్వయంగా ఈటల రాజేందర్ (Eatala Rajender) బీజేపీని బలహీనపరిచారు.
Jayasudha: బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే జయసుధ ? ముషీరాబాద్ నుంచి జయసుధ పోటీ చేసే అవకాశం ?
కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను తిట్టిన రఘునందన్ రావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నారు. నన్ను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఏ చంద్రశేఖర్, రవీందర్ నాయక్ లను సస్పెండ్ చేయాలి.
బీఆర్ఎస్ విషయంలో మోదీ, అమిత్ షా కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. కేసీఆర్ తో ఒప్పందంలో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో బలిపశువును చేశారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లిక్కర్ స్కామ్ కేసు నిర్వీర్యం చేశారు. మూడు పర్యాయాలు పార్టీని నిర్వీర్యం చేసిన కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలివ్వటం దేనికి సంకేతం? బీజేపీని హైదరాబాద్ కే పరిమితం చేసిన ఘనత కిషన్ రెడ్డిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను కేసీఆర్(CM KCR) అరెస్ట్ చేస్తారన్న భయం బీజేపీకి పట్టుకుంది హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదు? ” అని తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు.