Hyderabad, June 9: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్ 10 నుంచి జూన్ 19 వరకు మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటలనుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.
కాగా, కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో, లాక్‌డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడు నియోజకవర్గాల్లో లాక్‌డౌన్ ఉదయం 6 గంటలనుంచి 1 గంట వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖానాలను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.
బుధవారం నుంచి ప్రారంభించబోతున్న 19 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్ మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట,మహబూబ్ నగర్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ, రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో, జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలకు సరిపడా బ్లడ్ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
వరంగల్ లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్య సేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎం.డీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నిషియన్, డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన దవాఖాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాలకు ఆవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘ మెటర్నల్ ఐసీయూ’ లను, నవజాత శిశువుల కోసం ఎస్.ఎన్.సీ.యూ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిషలు కృషి చేయాలని కెబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టును అందించాలని నిర్ణయయించింది.
రెండో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ ఆరోగ్య సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి. జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంక కు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.