Maoists Killed In Encounter: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ, గడ్చిరోలిలో 26 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్,  కీలక నేత మిలింద్ తేల్తుంబ్డే హతం..
File image of Maoists used for representational purpose | (Photo Credits: PTI)

Maoists Killed In Encounter:  మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర పోలీసులు. మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓకేసారి 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనపై గడ్చిరోలి ఎస్పీ అకింత్ గోయల్ అధికారికంగా ప్రకటించిన వివరాలివి. మావోయిస్టుల ఆధిపత్యంలోని దండకారణ్యంలో కీలకమైన తొమ్మిది డివిజన్లలో ఒకటైన గడ్చిరోలిలో ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. ఆర్కే మరణం తర్వాత తెలంగాణలోని ములుగులో పోలీసుల ఎన్ కౌంటర్ లో ముగ్గురు కీలక నేతలు చనిపోయారు. ఉత్తరాదిలో పలువురు సీనియర్ నేతలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

మహారాష్ట్ర పోలీస్ శాఖలోని సీ-60 విభాగానికి చెందిన సాయుధ బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ సరిహద్దును ఆనుకుని ఉండే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధరిరా తాలూకా లోని గ్యారబట్టీ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ కౌంటర్ కొనసాగిందని, ఈ ఘటనలో మొత్తం 26 మంది మావోయిస్టులు చనిపోయారని, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని గడ్చిరోలి జిల్లా ఎస్పీ అకింత్ గోయల్ శనివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. కాగా, ఎన్ కౌంటర్ లో చనిపోయినవారిలో మావోయిస్టు కీలక నేత మిలింద్ తేల్తుంబ్డే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిలింద్ అలియాస్ దీపక్ తేల్తుంబ్డే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సంచలన బీమా కోరేగావ్ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తోన్న మిలింద్ తలపై ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించడం తెలిసిందే.

చలికాలం సమీపిస్తుండటంతో మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టుల వేటను ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే గడ్చిరోలిలోని గ్యారబట్టి అటవీ ప్రాంతంలో బలగాలు శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము కూడా ఎదురుకాల్పులు జరిపామని, కొన్ని గంటలపాటు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని, చివరికి కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం 26 మృతదేహాలను గుర్తించామని పోలీసులు చెప్పారు. ఎన్ కౌంటర్ లో పారిపోయిన ఇతర మావోయిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు.

గడిచిన కొద్ది నెలల్లో ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలపై మావోయిస్టులు పై చేయి సాధించడం, ఏప్రిల్ లో జరిగిన బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, 2017లో చింతగుహ ప్రాంతంలో నక్సల్స్ చేతిలో 25 మంది జవాన్లు బలి కావడం, 2010లో దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరగడం తెలిసిందే. ఛత్తీస్ గఢ్ వెలుపల చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ గడ్చిరోలిలో ఇవాళ జరిగిన ఘటనే అని తెలుస్తోంది. 26 మంది పార్టీ శ్రేణుల మృతిపై మావోయిస్టులు ప్రకటన చేయాల్సి ఉంది.