Satyavati Rathod Tattooed KCR Name (PIC @ Twitter)

Hyderabad, June 10: ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌న‌కున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ (Minister Satyavati Rathore) చాటుకున్నారు. త‌న చేతిపై కేసీఆర్ పేరును ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు (Satyavati Rathod Tattooed KCR Name) స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీం స‌హ‌చ‌రుని వారసుల‌తో మంత్రి స‌త్య‌వ‌తి ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారహిల్స్, రోడ్ నెం10 లోని బంజారా భవన్‌లో నిర్వ‌హించిన‌ గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి ఆదివాసీ, బంజారాలు త‌మ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు.

అయితే పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని కోరారు. నిర్వహకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా, మంత్రి కేసీఆర్ పేరును వేయాలి అని వారికి తెలిపారు. నొప్పిని భరిస్తూ కేసీఆర్ (KCR) పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు స‌త్య‌వ‌తి. కొమురం భీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రికి పచ్చబొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందించి, న‌గ‌దు బ‌హుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతుల‌ను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని స‌త్య‌వ‌తి రాథోడ్ పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేవరకు తాను చెప్పులు వేసుకోనని సత్యవతి రాథోడ్ దీక్ష చేస్తున్నారు. దాని ప్రకారం గత ఏడాదిన్నరగా ఆమె చెప్పులు లేకుండానే నడుస్తున్నారు.