Hyd, Feb 6: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గల మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ మియాపూర్ పీఎస్ కు వచ్చింది. అయితే ఆమె పట్ల సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరుపగా ప్రేమ్ కుమార్ వేధింపులు బయటపడ్డాయి. దీంతో, ఆయనను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో విధులు సరిగ్గా నిర్వర్తించని పలువురు సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసుకు సంబంధించి పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటంతో పాటు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.గోపాలపురం సీఐ మురళీధర్, ఎస్‌ఐ దీక్షిత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy) సస్పెండ్ చేశారు. గోపాలపురంలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో సరిగా విచారణ జరుపలేదని ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పటాన్‌చెరు సీఐ లాలూనాయక్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ సీఐని సస్పెండ్ చేస్తూ ఎస్పీ రూపేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రక్షాళన చేయండం హాట్ టాపిక్ అయ్యింది. భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ.. పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపింది.