MLA Rajaiah Meets Sarpanch Navya Family (Image: Twitter)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్య లైంగిక వేధింపుల వివాదంలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కె.నవ్య ఇటీవల మాజీ మంత్రి తాటి కొండ రాజయ్యపై లైంగిక వేధింపులు చేస్తున్నట్లు ఆరోపణలు చేసింది. అనంతరం ఈ వివాదానికి చెక్ పెట్టడానికి ఎమ్మెల్యే రాజయ్య నేరుగా సర్పంచి నవ్య ఇంటికి వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పారు. నవ్య దంపతులకు మీడియా ముఖంగా క్షమాపణలు చెబుతున్నట్లు వారి ఇంటి నుంచి రాజయ్య తెలపడం విశేషం. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెప్పడం విశేషం.

అనంతరం సర్పంచి నవ్య మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజయ్య ప్రోత్సాహంతోనే తాను సర్పంచి అయ్యానని , అయితే తాను అన్యాయాన్ని సహించనని, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

పక్కనే ఉన్న ఎమ్మెల్యే రాజయ్య సైతం మీడియాతో మాట్లాడుతూ, తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశంతో పాటు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం ఇవ్వడంతోనే తాను స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా జానకీపురం గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేయిస్తానని ప్రకటించారు.