
Mopal, August 12: నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే దారుణం (Nizamabad Shocker) జరిగింది.ఓ కసాయి కొడుకు భూతగాదాలతో కన్న తండ్రితో పాటు, చిన్నాన్నను హతమార్చాడు. ఈ ఘటన మోపాల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళ్తే.. మోపాల్‌కి చెందిన కర్రోళ్ల అబ్బయ్య, కర్రోళ్ల నడిపి సాయిలు ఇరువురు అన్న దమ్ములు కాగా, అబ్బయ్యకు, కుమారుడు కుర్రోళ్ళ సతీష్‌కు ఓ స్థలానికి సంబంధించిన విషయంలో గొడవల జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సతీష్ జంట హత్యలకు (Son Beats Father, Uncle To Death) పాల్పడటం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయంలో సతీష్ గడ్డపారతో తండ్రిని, బాబాయ్‌ని హతమార్చి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాలే హత్యకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు.దీంతో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే నిందితుడికి రెండేళ్ల నుంచి మానసిక స్థితి సరిగాలేదని గ్రామస్తులు అంటున్నారు. అబ్బయ్య, సాయిలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.