Nizamabad, NOV 19: నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి (Independent Candidate) కన్నయ్య గౌడ్ (Kannaiah Goud) ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సాయినగర్‌లో తన ఇంట్లో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల కమిషన్ రోటీ మేకర్ గుర్తును కేటాయించింది. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల కన్నయ్య ఆత్మహత్య (Sucide) చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కన్నయ్య గౌడ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. మృతుడి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. అయితే ఈ విషయమై దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.