Hyderabad, JAN 12: టీఎస్‌పీఎస్సీలో (TSPSC) ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ (Notification) చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించిందని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని సుమిత్రానంద్ విచారం వ్యక్తం చేశారు.
ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్ధన్‌రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డిలు రాజీనామాలు సమర్పించారు. వీరి రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని, తన సిబ్బంది ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.