Asifabad, April 05: కుమ్రంభీం ఆసిఫాబాద్ (Komaram Bheem) జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ గజ (Operation Gaja) విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి (Maharastra) వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అధికారుల సహాయంతో జిల్లా అటవీశాఖ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఈ ఏనుగు (Elephant) సరిహద్దు ప్రాంతాల ప్రజలను భయాందోళలకు గురి చేసింది. మూడు రోజుల క్రితమే రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన ఈ ఏనుగు చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో అల్లూరి శంకర్(55)ను, పెంచికల్‌పేట్ మండలం కొండపల్లిలో కారు పోశన్న(65)ను బలితీసుకుంది. దీంతో ఈ గజరాజు మళ్లీ ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందారు.
తక్షణమే ఆ ఏనుగును బంధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్‌ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మర్‌గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. మరికొంత సేపటికే జిల్లెడ, మొర్లిగూడ గ్రామాలకు వెళ్లే మార్గంలో ప్రయాణికుల కంట పడింది. కమ్మర్‌గాం-జిల్లెడ గ్రామాల మధ్య ఉన్న ముసలమ్మ గుట్ట వద్ద సుమారు 4 గంటల దాకా సేద తీరింది. అక్కడి నుంచి ఈ రాత్రి ప్రాణహిత దాటి మహారాష్ట్రకు వెళ్లిపోయింది.