(Photo: Twitter)

జానపద కళాకారుడు, మహబూబ్ నగర్‌ జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య మరోసారి జాతీయ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. మరుగున పడిపోతున్న, అంతరించి పోతున్న కిన్నెర వాయిద్యం కళకు అండగా నిలిచిన కళాకారుడిగా మొగిలయ్య గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడటం ద్వారా ప్రపంచ సంగీత రంగానికి పరిచయం అయ్యారు. మొగిలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దర్శనం మొగిలయ్య అలియాస్ 12 మెట్ల కిన్నెర వాయిద్య కారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. వంశపారంపర్యంగా వచ్చిన కిన్నెర వాయిద్యాన్ని స్వయంగా చేసుకొని పొట్టకూటి కోసం పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాటలు పాడుతూ బతుకు జీవనం కొనసాగిస్తూ వచ్చారు. అయితే భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన తర్వాత ఆయన దశ, దిశ తిరిగిపోయింది. పాలమూరులోని పేదల కోసం పోరాటం చేసిన మియా సాహెబ్ అనే వీరుడిపై రాసిన పాట సంగీత, సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ పాటనే మార్చి భీమ్లా నాయక్ చిత్రంలో ఆడాలేడు మియా సాబ్ ఈడాలేడు మియా సాబ్ అనే పాటగా మార్చారు. దాంతో ఒక్కసారిగా 12 మెట్ల కిన్నెర మొగిలయ్య పేరు మార్మోగింది. పవన్ కల్యాణ్ సినిమాలో పాట పాడిన తర్వాత మొగిలయ్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది.పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత నా జీవితం మారిపోయిందనే విషయాన్ని స్వయంగా మొగిలయ్య చెప్పడం తెలిసిందే.

12 మెట్ల కిన్నెర వాయిద్య కారుడిగా దర్శనం మొగిలయ్యకు అరుదైన గౌరవం దక్కింది. మొగిలయ్య కష్టాలు, ప్రతిభను తెలుసుకొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్మానం చేశారు. పాఠశాల విద్యలో భాగంగా ఎనిమిదో తరగతిలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.