
New Delhi, February 04: తెలంగాణలోని నిజామాబాద్ (Nizamabad) లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ 'ఎక్స్‌టెన్షన్' కార్యాలయం (Regional Spices Board Extension Center) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ మంగళవారం పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో ప్రకటించారు. నిజామాబాద్ లో ప్రస్తుతం ఉన్న డివిజనల్ స్థాయి బోర్డును రీజినల్ స్థాయికి అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఐఏఎస్ ర్యాంకు గల అధికారి ఈ ఎక్స్ టెన్షన్ కార్యాలయానికి ఐఏఎస్ స్థాయి అధికారి ప్రాతినిధ్యం వహిస్తారు, ఈ రీజినల్ ఆఫీస్ నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకే నివేదిక అందజేస్తుంది అని పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఇక్కడి రైతుల పసుపు మరియు మిరప పంటలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, దీనిపై నిజామాబాద్ ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు పసుపు బోర్డ్ కంటే ఎక్కువ ప్రయోజనాలు ఈ ఎక్స్ టెన్షన్ కార్యాలయం ద్వారా కలుగుతాయన్నారు.
రైతుల డిమాండ్ ఏంటి? కేంద్రం ప్రకటించిందేంటి?
ఎంపీ అరవింద్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి, సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోకసభ స్థానం యావత్ దేశాన్ని ఆకర్శించింది. కారణం తమ పంటకు మద్ధతు ధర, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుమారు 180 మంది పసుపు రైతులు ఎన్నికల్లో నామినేషన్ వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఆ సమయంలో ప్రధాని మోదీ మరియు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసిన అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి, తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయిస్తానని సవాల్ చేశారు. అలా చేయని పక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులతో పాటు ఉద్యమంలో పాల్గొంటానని 'బాండ్ పేపర్' పై సంతకం చేశారు.
ఫలితాల తర్వాత అరవింద్ ఎంపీగా విజయం సాధించారు. ఏడాది దాటినా, ఎంపీ అరవింద్ 5 రోజుల పసుపు బోర్డ్ వాగ్ధానం మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్- బీజేపీ మధ్య నిజామాబాద్ లో వార్ నడుస్తూనే ఉంది. ఏమైంది పసుపు బోర్డ్ అని? అధికార పార్టీ నేతలు ఎంపీ అరవింద్ పై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు మంత్రి పియూష్ గోయల్ తో ప్రకటన చేయించారు. 'అశ్వత్థామ హత: కుంజర' లాగా.. పసుపు బోర్డ్ అని ప్రస్తావించకుండా " కేంద్రమంత్రి పసుపుపై" అని ఎంపీ ట్వీట్ చేశారు. ఎంపీ అరవింద్ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.
MP Arvind Dharmapuri's Tweet:
Shri @Piyushgoyal ji announcement on Turmeric https://t.co/NbGDJVoZnI
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 4, 2020
అయితే, రైతులు డిమాండ్ చేసింది పసుపు బోర్డ్, ఎన్నికల్లో అరవింద్ హామీ ఇచ్చింది కూడా పసుపు బోర్డ్, అయితే ఇప్పుడు కేంద్రం మాత్రం పసుపు బోర్డ్ కాకుండా ఇప్పటికే నిజామాబాద్ లో ఉన్న కార్యాలయం స్థాయిని విస్తరించింది. బోర్డ్ కంటే ఈ ఎక్స్‌టెన్షన్ కార్యాలయంతోనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది. దీనిని బట్టి నిజామాబాద్ లో ఇక 'పసుపు బోర్డ్' ఏర్పాటు చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేనట్లు స్పష్టం అవుతోంది. మరి ప్రాంతీయ ఎక్స్ టెన్షన్ కార్యాలయం పట్ల రైతుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.