(Credits: X)

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలు వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లికగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆమె ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతోంది.  వరుస రిక్రూట్‌మెంట్ పరీక్షలను రద్దు చేయడంతో ఆమె మనస్తాపానికి గురైనందున ఆమె ఈ నిర్ణయం  తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణనిచ్చే అనేక విద్యాసంస్థలు అలాగే విద్యార్థులకు వసతి కల్పించేందుకు హాస్టళ్లు ఉన్న అశోక్‌నగర్‌లో ఆమె ఆత్మహత్య వార్త వేగంగా వ్యాపించింది. హాస్టల్ వద్దకు పెద్దఎత్తున ఉద్యోగ అభ్యర్థులు గుమిగూడి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగి పోలీసులను ప్రాంగణంలోకి రానీయకుండా అడ్డుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ప్రవల్లిక తన గదిలో శవమై కనిపించింది. పరీక్షలను రద్దు చేసిన తీరుపై ఆమె మనస్తాపం చెందిందని ఆమె స్నేహితులు ఆరోపించగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను నిగ్గుతేల్చుతున్నామని పోలీసులు తెలిపారు.

ప్రవల్లిక చనిపోయే ముందు రాసిన చివరి లేఖ

ప్రేమ వ్యవహారమే కారణం.. పోలీసుల కోణం ఇదే..

ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం శనివారం ప్రవల్లిక ఆత్మహత్యలో మరో కోణాన్ని ఆవిష్కరించారు.  ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రవళిక 15 రోజుల క్రితమే హాస్టల్‌లో చేరిందని.. గత కొన్నాళ్లుగా శివరామ్ అనే వ్యక్తితో ప్రవళిక ప్రేమలో ఉందని.. ప్రవళిక ప్రేమించిన అబ్బాయికి వేరే అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని, ప్రవళికను మోసం చేసిన శివరామ్‌ మరొకరితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని, శివరామ్ చేసిన మోసాన్ని ప్రవళిక జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుందని.. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుసని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రవళిక తల్లి వాదన ఇదే...

మరోవైపు ప్రవళిక మృతదేహం వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చేరుకోగా, తమ కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలివిసేలా రోధిస్తున్నారు. అయితే తమ కుమార్తె మరణానికి . గ్రూప్ 2 పరీక్షల వాయిదానే కారణమని ప్రవళిత తల్లి ఆరోపిస్తోంది. దీనికి సంబధించిన వీడియో చూద్దాం.

ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: రాహుల్ గాంధీ..

ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ.. ప్రవళిక ఆత్మహత్య చాలా బాధాకరమని ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య అని తెలంగాణ యువత ఉపాధి లేక నిరుత్సాహంలో ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.