Jangon, June 18: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణ (Nalla Ramakrishna) దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 15న కిడ్నాప్ అయిన రామకృష్ణ మృతదేహాన్ని జనగామ మండలంలోని చెంపక్ హిల్స్ వద్ద అటవీ ప్రాంతంలో గుర్తించారు. రామకృష్ణను ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త, మరో సర్పంచ్ సహా బాధితులంతా కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకొని హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్య చేసిన అనంతరం హంతకులు రామకృష్ణ బాడీపై బట్టలనుకూడా తొలగించి కాల్చి బూడిద చేసినట్లు పోలీసులు గుర్తించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టీఐ (RTI) సమాచారసేకరణవల్ల రామకృష్ణతో పలువురికి వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరి పట్టాదారు పాస్ బుక్‌ను రామకృష్ణ రద్దు చేయించినట్లు తెలిసింది. తమ భూములను తమకు కాకుండా చేస్తున్నాడని రామకృష్ణపై పలువురు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. దీంతో రామకృష్ణ అడ్డు తొలగించుకొనేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రజాప్రతినిధి భర్త, మరో సర్పంచ్ సహా బాధితులంతా కిరాయి హంతకులతో హత్య చేయించి ఉంటారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, రామకృష్ణ కిడ్నాప్ అయితన తరువాత బచ్చన్నపేట ఎస్ఐ, సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రామకృష్ణ బంధువులు బచ్చన్నపేట చౌరస్తా వద్ద ధర్నా చేశారు.
రామకృష్ణ హత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రామకృష్ణ కు ఎవరెవరితో వివాదాలు ఉన్నాయి, ఎవరి భూముల విషయంపై అతను ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందా అనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఈ విషయంపై జనగామ డీఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ఈ నెల 15న రామకృష్ణ కిడ్నాప్ అయినట్లు తెలిపారు. మృతదేహాన్ని చెంపక్ హిల్స్ లో గుర్తించటం జరిగిందని అన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని, ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. పూర్తి విచారణ జరిపి హత్యకు సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. రామకృష్ణ హత్య కేసులో ప్రమేయంఉన్న వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.