Hyderabad, April 21: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ (BRS) రూ.25 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) చేసిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు. ఈటలకు దమ్ముంటే ప్రమాణం చేయడానికి భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలన్నారు. శనివారం సాయంత్రం 6గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేద్దాం అన్నారు. తాను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తానన్నారు రేవంత్ రెడ్డి. శనివారం సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తా, డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల కూడా గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలని చాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి. భాగ్యలక్ష్మి అమ్మవారు బీజేపీ నేతలకు అత్యంత నమ్మకమైన దేవత అన్న రేవంత్ రెడ్డి నేను తడిబట్టలతో ప్రమాణం చేస్తానని అన్నారు. మునుగోడు ఎన్నికలే (Munugode elections) కాదు కేసీఆర్ తో (KCR) అణా పైసా ముట్టలేదన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన ప్రతీ రూపాయి కాంగ్రెస్ కార్యకర్తల పైసలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, దిగజారుడుతనానికి పరాకాష్ట అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
” మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ దగ్గర రూ.25 కోట్లు తీసుకోలేదు. ఈటల రాజేందర్ నా ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కులస్తులు పైసలు ఇచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బతకాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఫండింగ్ చేశారు. పార్టీలో ఉండే ముఖ్యులను సాయం చేయాలని కోరితే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలే ముందుకు వచ్చి సాయం చేశారు. ఉన్నత వర్గాల వారు సహాయం చేయలేదు. బీఆర్ఎస్, కేసీఆర్ నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా లబ్ది పొందలేదు. ఈటల రాజేందర్ దేవుడిని నమ్మితే నా సవాల్ స్వీకరించాలి. భాగ్యలక్ష్మి గర్భగుడిలో ఒట్టువేసి నేను చెబుతా. ఒక్క పైసా తీసుకోలేదని. ఆయనకు భాగ్యలక్ష్మి దేవాలయంపై నమ్మకం లేకపోతే మరో గుడి ఏదైనా చెప్పాలి. ఆ గుడికే నేను వస్తా.
ఈటల దిగజారుడు ఆరోపణలు చేయడం క్షమించరాని నేరం. ఈటల రాజేందర్ చేతకానితనంతో లేకి రాజకీయాలు చేస్తానంటే చేసుకోమనండి. సమాజం ముందు నేను అగ్నిపరీక్షకు సిద్ధపడుతున్నా. శనివారం సాయంత్రం కచ్చితంగా భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్తున్నా. ఈటల రాజేందర్ కు 24 గంటల సమయం ఇస్తున్నా” అని రేవంత్ రెడ్డి చెప్పారు.