Supreme Court grants bail to BRS MLC Kavitha in Delhi excise policy case

Delhi, Aug 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈడీ, సీబీఐ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను అదుపులోకి తీసుకుంది ఈడీ. ఆ తర్వాత సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో తీహార్ జైలులో ఉన్నారు కవిత.

బెయిల్ ఇవ్వాలని పలుమార్లు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా సుప్రీంను ఆశ్రయించారు కవిత. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం బెయిల్‌ మంజూరు చేసింది. కవితకు బెయిల్ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ మరో 15మందికిపైగా ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. న్యాయ నిపుణులతో చర్చించారు.

కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా కవిత తరపున ముకుల్ రోహత్గీ, ఈడీ తరపున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సందర్భంగా పలు కండీషన్స్ పెట్టింది న్యాయస్థానం. రూ, 10 లక్షల పూచికత్తుతో పాటు సాక్షులను ప్రభావితం చేయరాదని తెలిపింది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సుప్రీం కోర్టు. విచారణ పూర్తయిన తర్వాత బెయిల్ నిరాకరించడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

Here's Tweet:

ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని కవిత తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని ,సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని, కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అని, దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.