Bhuvanagiri, April 17: యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య (Honour Killing) సంచలనం సృష్టించింది. కూతురు కులాంతర వివాహం చేసుకోవటం నచ్చని తండ్రి అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భువనగిరికి (Bhuvanagiri) చెందిన భార్గవి (Bhargavi) అనే యువతి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ (Ramakishna) అనే యువకుడితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ 2020లో ప్రేమ వివాహం (Love marriage) చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు లింగరాజుపల్లిలో ఉన్న రామకృష్ణ దంపతులు, భార్గవి కి ప్రెగ్నెన్సీ రావటంతో భువనగిరికి వచ్చారు. ఆరునెలల క్రితం వీరికి ఆడపిల్ల పుట్టింది. రామకృష్ణ గతంలో హోం గార్డుగా (Home gaurd) పని చేసేవాడు. తుర్కపల్లిలో గుప్తనిధుల తవ్వకం కేసులో సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈనెల 15న హైదరాబాద్ కు చెందిన లతీఫ్ (Lathif) అనే వ్యక్తి భూమి చూపించటానికి రామకృష్ణను హైదరాబాద్ తీసుకు వెళ్లాడు. అప్పటి నుంచి రామకృష్ణ ఇంటికి తిరిగి రాకపోవటంతో భార్య భార్గవి శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కనూర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించారు. మృతుడిని భార్గవి కుటుంబ సభ్యులే కావాలని హైదరాబాద్ రప్పించి హత్యచేయించారని రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాగా రామకృష్ణ మామ వెంకటేష్ రాజపేట మండలం కాలువపల్లిలో వీఆర్వోగా పని చేస్తున్నాడు. రామకృష్ణ హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న మరో హోం గార్డు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.