Hyderabad, July 27: తెలంగాణ శాసనసభ (Telangana Assembly) సోమవారానికి వాయిదా పడింది. బడ్జెట్‌పై (Telanagana Budget) సాధారణ చర్చ ముగియగానే సభను ఈ నెల 29వ తేదీకి సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ రాత్రి 9:15 గంటల వరకు కొనసాగింది. బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు.
అక్షరాలను తొలగిస్తారేమో కానీ, అనుభవాల్ని తొలగించలేరన్నారు. బీఆర్ఎస్ శ్రమను, కాంగ్రెస్ ఎనిమిది నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం అవాస్తవాలతో నిండి ఉంది. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారు. పన్నేతర ఆదాయంలో రూ.35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో చూపించారు. ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విధానాల రూపకల్పన కంటే బీఆర్ఎస్‌ను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారన్నారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇప్పుడు రూ.10 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సమీకరిస్తున్నారుని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Live: Former Minister, MLA Sri @BRSHarish speaking in Telangana Legislative Assembly. https://t.co/p5u3XcqEqT
— BRS Party (@BRSparty) July 27, 2024
సాధ్యంకాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపించారని, తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపించారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే వస్తున్నది. ఆలస్యం అయిందని రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందల పింఛన్ ఇస్తే బీఆర్ఎస్ పాలనలో రూ.2వేలకు పెంచామని తెలిపారు. అధికారంలోకి రాకముందు రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్నారు. ఆ 4 వేల పింఛన్ ఇంకా నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు.