Hyderabad, FEB 04: తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet) ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 3.30గంటలకు మంత్రులు సెక్రటేరియట్ లో భేటీ కానున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రేవంత్ రెడ్డి మంత్రివర్గం (Telangana Cabinet) ప్రధానంగా ఆరు గ్యారెంటీలపై ఫోకస్ పెట్టింది. ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. రూ. 500కే గ్యాస్ సిలీండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ను అమలు చేసేందుకు తెలంగాణ కేబినెట్ రంగం సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) కు క్యాబినెట్ ఆమోదంముద్ర వేయనుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా క్యాబినెట్ ఖరారు చేయనుంది. ఈనెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 8న సమావేశాలు ప్రారంభమైతే అదేరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చజరిగే అవకాశం కూడా ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత 12 నుంచి ఐదు రోజులు పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget) ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బేరీజు వేసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో టౌన్ షిప్ డెవలప్మెంట్, ఐటీ రంగాలతో పాటు కొత్త ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపైకూడా చర్చించనున్నారు. అలాగే గ్రూప్ -1 నోపికేషన్ పై కూడా ఈ సమావేశంలో చర్చజరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈసారి జరిగే సమావేశాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏ శాఖకు ఎంత నిధులు కేటాయింపులు చేయబోతుందన్న ఉత్కంఠను కలిగిస్తోంది.