Hyderabad, Mar 10: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమించడంపై అనేక విమర్శలు (TS Tourism Ambassador Row) వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు.
ప్రస్తుతం తాను (Telangana Excise and Tourism Minister Srinivas Goud) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, తొందరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, త్వరలోనే ఒక మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’s Day) సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా (TSTDC Chairman Uppala Srinivas Gupta) ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. అయితే మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఈ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది.
Here's Telangana State Tourism Tweet
Sri Uppal Srinivas Gupta Garu, Chairman of Telangana state tourism Development corporation, appointed Miss Alekhya Harika as the new brand ambassador for TSTDC@USrinivasGupta @VSrinivasGoud @KTRTRS @harika_alekhya #Telanganatourism #TSTDC pic.twitter.com/cMIyK4yRlp
— Telangana State Tourism (@tstdcofficial) March 8, 2021
దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హారికకు (Bigg Boss Dethadi Harika) నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఆమెను నియమించిన టూరిజం శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హారికను తొలగించారంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తక్కువ ఖర్చుతో రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం చేసేందుకే హారికను ఎంపిక చేశామని చెప్పారు.
ఈ విషయంపై గతంలోనే పర్యాటక మంత్రి అనుమతితో టూరిజం బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మహేశ్ బాబు వంటి హీరోలతో ప్రచారం చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. అందుకే యూట్యూబ్ ద్వారా పేరుగాంచిన హారికను ఎంపిక చేశామని చెప్పారు. హారిక అయితే తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేయించుకోవచ్చని తెలిపారు
హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది. ఇక హారిక నియామకంపై ఓ రేంజ్‌లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు.
యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు.
తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యారు. హౌజ్‌లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్ వరకు పోరాడారు. టాప్ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు.