Hyderabad, Mar 10: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మందుబాబులు ట్రాఫిక్ పోలీసులుకు భారీగానే ముట్టచెప్పారు. భాగ్యనగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ (Drunk and Drive in HYD) ట్రాఫిక్ పోలీసులు చిక్కిన 753 మంది మందుబాబులు గత నెలలో అక్షరాలా రూ.78,94,100 జరిమానా రూపంలో ( Drunk Addictors Pays Huge Amount Of Challans) చెల్లించారు . ఫిబ్రవరిలో 3,261 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కారని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. వీరిలో 768 మందిపై కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశామన్నారు.
15 మందికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన 753 మందికి రూ.78.94 లక్షలు జరిమానా విధించిందన్నారు. జైలు శిక్ష పడిన వారిలో ఒకరికి 15 రోజులు, మరొకరికి 8 రోజులు, ముగ్గురికి వారం, ఎనిమిది మందికి ఐదు రోజులు శిక్షలు పడ్డాయి. మరో ఇద్దరిని కోర్టు సమయం ముగిసే వరకు నిల్చునేలా న్యాయమూర్తి ఆదేశించారు. గత నెలలో చిక్కిన వారిలో మిగిలిన 2493 మంది పైనా త్వరలోనే చార్జ్‌షీట్స్ వేయనున్నట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు.
కాగా ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cybarabad Traffic Police ) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు