Hyderabad January 15: తెలంగాణలోని రాజ్‌భ‌వ‌న్‌ (Rajbhavan)లో సంక్రాంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. సంక్రాంతి (sankranti ) వేడుక‌ల్లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై (tamilisai) సౌంద‌ర్ రాజ‌న్ స్వ‌యంగా పొంగ‌ల్ (Pongal) వండి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రాజ్‌భ‌వ‌న్‌లోని మెయిన్ హౌస్ ముందు గ‌వ‌ర్న‌ర్ పొంగ‌ల్ వంట‌కాలు వండి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ తరువాత గవర్నర్ తమిళిసై (governor tamilisai), ఆమె భర్త డాక్టర్ సౌందరరాజన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భ‌వ‌న్‌లోని గోశాలలోని గోవులకు ప్రత్యేక గో పూజలు చేశారు. గో పూజ తర్వాత రాజ్‌భ‌వ‌న్‌లోని అమ్మవారి ఆలయంలో గవర్నర్ త‌న కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో, ఆరోగ్యంతో, సమృద్ధితో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మహమ్మారిని అదుపులో ఉంచుతూ… అన్ని జాగ్రత్తలతో, ఆరోగ్యకరంగా పండుగ జరుపుకోవాలని తమిళిసై సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో మంచి ఫలితాలు సాధిస్తూ అందరికీ రక్షణ కల్పించడంలో ముందున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే 100% మొదటి డోసు కవరేజ్ సాధించి, రెండో డోసు కవరేజ్‌లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు. ఆరోగ్య రంగంలో మంచి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కొనియాడారు. ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించి, టీకా తీసుకుని, సరైన జాగ్రత్తలు పాటించినప్పుడు మాత్రమే ఈ కోవిడ్ మహమ్మారి నుండి రక్షణ పొందుతామని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.