Hyderabad, FEB 28: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు (Intermediate Board Exams) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ 4,78,718 మంది విద్యార్థులు, సెకండర్ ఇయర్ విద్యార్థులు 5,02,260 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ -1 పరీక్ష జరుగుతుంది. గురువారం సెకండియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ -2కు పరీక్ష ఉంటుంది.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board Exams) ఏర్పాట్లు చేసింది. పరీక్షల పర్యవేక్షణ కోసం 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష విధుల్లో ఉండబోతున్నారు. 200 సిట్టింగ్ స్వ్కాడ్లు, 75 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ లు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తెరుస్తారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్రింటెండ్ మెటీరియల్స్ అనుమతించబడదు. పరీక్షలు రాసే విద్యార్థులకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
విద్యార్థులకు సూచనలు
విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీరు డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ప్రిన్సిపల్స్ సంతకాలు ఉండాల్సిన అవసరం లేదు.
హాల్ టికెట్ ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తే ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలి.
ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
9గంటలు మించి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి.
పరీక్ష కేంద్రంలో పావుగంట ముందే ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అభ్యర్థి పూర్తివివరాలను 9గంటలలోపు చూసుకొని తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు.