Telangana Municipal Polls- 2020| (Photo-ANI)

Hyderabad, January 22: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్  (Telangana Municipal Polls 2020) ముగిసింది.  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 70.26 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 93.31%  పోలింగ్ నమోదవగా , అత్యల్పంగా నిజాంపేట కార్ర్పోరేషన్ లో 39.65% పోలింగ్ నమోదైంది.  కామారెడ్డిలో టెండర్ ఓటు పడటంతో ఒక వార్డుకు ఈనెల 24న రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

 చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.  జనవరి 25న కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరగనుంది.  ఇప్పటికే కార్పోరేషన్ లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం అయినట్లు అధికారులు వెల్లడించారు.

టీఆర్ఎస్ పార్టీ 2,972 మంది అభ్యర్థులను నిలబెట్టంగా అందులో 77 మంది ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 2,616 అభ్యర్థులు, బిజెపి నుంచి 2,313, టీడిపి నుంచి 347 బరిలో ఉన్నారు.  AIMIM 276 వార్డులలో పోటీ చేస్తోంది, అందులో ఇప్పటికే 3 ఏకగ్రీవం అయ్యాయి.   సిపిఐ, సిపిఎంల నుంచి వరుసగా 177, 166 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  అయితే 90 శాతం సీట్లు తామే గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

పోలింగ్ చివరి గంటలో కొన్ని చోట్ల టీఆర్ఎస్- కాంగ్రెస్- బీజేపీ- మజ్లిస్ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, గొడవలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి,  తెరాస అభ్యర్థి ముక్కును కొరికాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు, కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

ఇక మరోవైపు, కరీంనగర్ కార్పోరేషన్‌కు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ కార్ఫొరేషన్‌కు జనవరి 24న పోలింగ్ జరగనుంది. రీపోలింగ్‌కు అవకాశం ఏర్పడితే 25న నిర్వహిస్తారు. జనవరి 27న ఫలితాల వెల్లడి జరుగుతుంది.