Hyderabad, JAN 12: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివెల్-2024 (International Kite Festival) సందర్భంగా పరేడ్ గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణాలు సాగించాలని సూచించారు. పరిస్థితులను బట్టి తివోలి క్రాస్ రోడ్డు నుంచి ఫ్లాజా ఎక్స్ రోడ్డు వరకు రోడ్డును మూసేసి, ట్రాఫిక్‌ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్ బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్ జంక్షన్స్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బన్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, పారడైజ్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌స్టాండ్‌కు వచ్చిపోయే ప్రయాణికులు తమ ప్రయాణాలను సాఫీగా చేసే విధంగా ఫ్లాన్ చేసుకోవాలని సూచించారు. మెట్రో రైలు సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రౌండ్‌కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలని వెల్లడించారు.