Rains

Hyderabad, Aug 02: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (TSDPS) తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మి.మీ, హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా (Severe Low Pressure) మారి ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తీరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఇది గంటకు 25 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నదని తెలిపింది.

Hyderabad Rains: ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్త.. అకస్మాత్తుగా పడిన భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన 

ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. మహారాష్ట్ర, కొంకణ్‌ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో మంగళవారం నుంచి ఐదురోజులపాటు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.