Hyderabad, March 23: గ్రూప్-1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్ ఆప్షన్ (Edit Option) కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటించారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో పేరు, పుట్టిన తేదీ, జెండర్, విద్యార్హతలు, ఫొటో, సంతకం వంటి వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని ఈ నెల 27వ తేదీ వరకు సరి చేసుకోవచ్చని ఈ సందర్భంగా నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19వ తేదీన టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది.
అయితే చివరి రోజు సర్వర్ మొరాయించడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఫలితంగా 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కేవలం 2.7 లక్షల దరఖాస్తులే వచ్చాయి. దీనిపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల గడువు ముగిసేసరికి 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాగా, గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన, మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నారు.