Girl Missing (PIC@ File Photo)

Hyderabad, DEC 29: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ (Karimnagar Girl Missing Case) ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రావాల్సిన మైనర్‌ బాలిక (Girl) ఈ నెల 27న బొమ్మకల్‌ ఫ్లై ఓవర్‌ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై బాలిక తండ్రి నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గురువారం రాత్రి సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌లో (JBS) దొరకడంతో కరీంనగర్‌కు తీసుకువచ్చిన రూరల్‌ పోలీసులు వైద్యం కోసం దవాఖానలో చేర్పించారు ఈ సందర్భంగా కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కర్ణాకర్‌రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

Free Bus Service For Women: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సు డ్రైవర్ మీద దాడి చేసిన ఆటో డ్రైవర్లు, ఉద్యోగం చేయలేనంటూ ఏడ్చేసిన మహిళా కండక్టర్ 

సెలవులు రావడంతో సదరు బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఫ్లైఓవర్‌ వద్ద దిగి వేరే బస్సు ఎక్కి హైదరాబాద్‌ వెళ్లింది. అయితే, అదే రోజు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా సీసీ ఫుటేజీల ద్వారా హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌లో తిరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ కోణంలో విచారించగా ఇంటికి వెళ్లేందుకు భయపడిన బాలిక.. ఫ్రీ బస్సు సౌకర్యం (Free BUS) ఉండటంతో జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌ బస్సుల్లో తిరుగుతూ చివరకు గురువారం రాత్రి మళ్లీ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంది. అప్పటికే ఆర్టీసీ బస్టాండ్‌ సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు జూబ్లీ బస్టాండ్‌లో నిఘా వేయడంతో అక్కడకు వచ్చిన బాలికను చేరదీశారు. 36 గంటల్లోనే కేసు ఛేదించి బాలికను క్షేమంగా తీసుకువచ్చిన రూరల్‌ సీఐ ప్రదీప్‌, ఎస్‌ఐ వెంకటరాజం, సిబ్బంది దయానంద్‌, అంజయ్య, తిరుపతి, రాజేందర్‌ను ఏసీపీ అభినందించారు.