Telangana Minister Uttam Kumar Reddy (Photo-ANI)

Hyderabad, May 21: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై (Uttam Kumar reddy) బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్‌ ట్యాక్స్‌ (R Tax) వసూలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. కొత్తగా యూ ట్యాక్స్‌ (U Tax) కూడా వసూలు చేస్తున్నారని తెలిపారు. మొన్న 500 కోట్లు చేతులు మారాయని చెప్పారు. అందులో రూ.100 కోట్లను ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఢిల్లీకి పంపించారని తెలిపారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని చెప్పడానికే ఉత్తమ్ డబ్బులను ఢిల్లీకి పంపించారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేసులో ఎక్కడ వెనుకబడిపోతానేమో అన్న భయంతోనే ఉత్తమ్‌ ఇలా చేశారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. తేమ పేరుతో క్వింటాలుకు 10 నుంచి 12 కిలోల తరుగు తీసేస్తున్నారని మండిపడ్డారు. సివిల్‌ సప్లై డైరెక్టర్‌ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ గురించి పెద్దగా తెలియదని.. ధాన్యం కొనుగోళ్లలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎవరి జేబులోకి వెళ్తోందని ప్రశ్నించారు. 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. అధిక ధాన్యం జోకడంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయని.. కొల్లగొట్టిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఏమవుతున్నాయనే దానిపై సివిల్‌ పస్లై కమిషనర్ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

అధిక ధాన్యం జోకడంతో వచ్చిన డబ్బులో నుంచి కేసీ వేణుగోపాల్‌కి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రూ.500 కోట్లు ఇచ్చారని విమర్శించారు. రైస్‌ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కై వారికి రూ.450 కోట్లు ఇచ్చారని తెలిపారు. అలా మొత్తం రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైస్‌ మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్‌ రైస్‌ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్‌ మిల్లర్లకు మళ్లీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైస్‌ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. తన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.